
23న జిల్లాకు సీఎం రేవంత్ రాక!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వారంలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు జిల్లాకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జిల్లాలో తొలిసారి అధికారికంగా పర్యటించనున్నారు. ఇటీవల సంగారెడ్డిలోని రాంమందిర్ వద్ద జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థానికి రేవంత్‌రెడ్డి హజరైన విషయం విదితమే. నిమ్జ్ (జాతీయ ఉత్పాదక, పెట్టుబడుల మండలి)లో నిర్మించిన రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇతర అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
30 వేల మందితో సభ!
సీఎం జిల్లా పర్యటన సందర్భంగా జహీరాబాద్‌లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ సభకు సుమారు 30 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటన షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ఒకటీ రెండు రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ప్రారంభించేందుకు జహీరాబాద్ వెళ్లనున్నారు.
నిమ్జ్‌లో పలు అభివృద్ధి పనులకు
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
జహీరాబాద్‌లో బహిరంగ సభ!