
భూసర్వేనా.. సర్సర్లే..!
సర్వేయర్ల కొరత.. తీరని భూముల కొలత
● పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలు ● హద్దు రాళ్లు లేకపోవడమే ప్రధాన సమస్య ● పెండింగ్‌లో 4 వేలకు పైగా దరఖాస్తులు
జిల్లాలో మొత్తం సర్వే నంబర్లు 1,67,948
మొత్తం భూమి 8లక్షల ఎకరాలకు పైనే..
మండల సర్వే కొరకు 4070..
జిల్లా సర్వే కొరకు పెండింగ్ దరఖాస్తులు 400
సంగారెడ్డి జోన్: జిల్లాలో సర్వేయర్ల కొరత కారణంగా భూ సర్వేల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా.. పెండింగ్‌లోనే ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన భూ ప్రక్షాళన ఫలితంగా జారీ చేసిన కొత్త పట్టా పాసు పుస్తకాలలో భూమి వాస్తవానికి భిన్నంగా ఉండటంతో బాధితులు సర్వే కొరకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ఎనిమిది మంది సర్వేయర్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు మాత్రమే ఉన్నారు. మండలానికి ఒకరు చొప్పున 28 మంది సర్వేయర్లకు గాను 15 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సర్వేయర్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవారికి అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో సర్వే పనులు మాత్రం ముందుకు సాగటం లేదు.
● పెండింగ్‌లో దరఖాస్తులు
జిల్లాలో 28 మండలాలకు గాను 760 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాలలో 1,67,948 సర్వే నంబర్లు, సుమారు 8 లక్షలకు పైగా ఎకరాల భూమి ఉంది. 96,195 టీ పన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆయా సర్వే నంబర్లలో గత కొన్ని సంవత్సరాలు క్రితం సర్వే చేయగా ప్రస్తుతం హద్దులు చెరిగిపోయి, భూములు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో మొత్తం 4,470 దరఖాస్తులలో మండల సర్వేకు 4070, జిల్లా స్థాయి సర్వేకు 400 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
● సర్వేయర్ల కొరకు నిరీక్షణ
తమ భూములు సర్వే చేసేందుకు అధికారుల కొరకు ఎదురుచూపులు తప్పడం లేదు. మండల స్థాయిలో సర్వే చేసుకునేందుకు రూ.295, జిల్లాస్థాయిలో రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించి నెలలు తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. సర్వే చేసేముందు సరిహద్దు యజమానులకు నోటీసులు అందించాల్సి ఉంటుంది. గతంలో వీఆర్‌ఓ నోటీసులు అందించేవారు. ప్రస్తుతం వారు లేకపోవడంతో అందించడంలో జాప్యం జరుగుతోంది.
● ప్రభుత్వ పనుల్లో అధికారులు బిజీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో సర్వేయర్లు బిజీగా ఉన్నారు. భూ సేకరణ, భూ కేటాయింపు, సర్వేలు తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం నిమ్జ్, ఎన్.హెచ్ 65, టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, ట్రిపుల్ ఆర్ తదితర పనుల్లో ఉన్నారు.