
సిటీ స్కాన్ సెంటర్ సీజ్
నారాయణఖేడ్: అనుమతిలేకుండా పట్టణంలో కొనసాగుతున్న సిటీ స్కాన్ కేంద్రంతోపాటు జీవవ్యర్థాల అమలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ల్యాబ్‌ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. గురువారం నారాయణఖేడ్‌లో జిల్లా వైద్యాధికారిణి డా.గాయత్రీ దేవి ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, సిటీస్కాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతిలేకుండా సిటీ స్కాన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ తనిఖీల్లో గుర్తించిన అధికారులు వెంటనే నోటీసులిచ్చి సీజ్ చేశారు. కాగా, ఈ సిటీ స్కాన్ కేంద్రానికి రెండేళ్ల క్రితం కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ అనుమతులు తీసుకోకపోవడంతోనే సీజ్ చేసినట్లు గాయత్రీదేవి చెప్పారు. జిల్లాలో మూడేళ్ల కాలంలో 74 అనుమతి లేని ఆస్పత్రులను సీజ్ చేశామని, 48 ఆస్పత్రులకు రూ.3.78లక్షల జరిమానా కూడా విధించినట్లు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.సంధ్యారాణి, ఇన్‌చార్జీ డీఐఓ డా.మనోహర్, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ జెట్ల భాస్కర్ ఉన్నారు.
సక్రమంగా విధులు
నిర్వహించాలి
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: పోలీసు అధికారులు విధి నిర్వహణలో తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం రెండు రోజులపాటు నిర్వహించిన ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్‌తోపాటు ఎంఎస్‌సీడీ పాపిలోన్ డివైస్‌పై రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్‌స్పెక్టర్ పింకీ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ ఫెయిల్ విద్యార్థులకు మరోసారి అవకాశం
సదాశివపేట(సంగారెడ్డి): డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భారతి గురువారం తెలిపారు. 2016 నుంచి 2021 మధ్య డిగ్రీ చదివి 1 నుంచి 6 సెమిస్టర్ వరకు ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్‌టైం సెటిల్మెంట్ ప్రకారం పరీక్షలు రాసేందుకు ఉస్మానియా వర్సిటీ అవకాశం కల్పించిందని ఆమె వెల్లడించారు. పరీక్షలకు అపరాధ రుసుం లేకుండా మే 19 వరకు అపరాధ రుసుంతో మే 29 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9701956872, 8341298597 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
నాణ్యమైన విద్యను
అందించాలి
డీఈఓ వెంకటేశ్వర్లు
కంది(సంగారెడ్డి): విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. కందిలోని లక్ష్మీనగర్లో గల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన క్యాలెండర్‌ను డీఈఓ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...పాఠశాలకు అదనపు తరగతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దాతలు కాశీనాథ్, సురేశ్‌నాయక్, మహమ్మద్ తయ్యబ్‌లను అభినందించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం వెంకటలక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం లీలావతితోపాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని
సద్వినియోగం చేసుకోండి
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొల్కుర్ గ్రామంలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కష్టపడి పండించిన పంటను దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.