
సొంతిల్లు కలేనా!
ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి
నారాయణఖేడ్: ఇందిరమ్మ పథకంతో పేదోడి సొంతింటి కల తీరుస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పథకం పనితీరు మందగించింది. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. సొంత స్థలాల్లో ఇండ్లను నిర్మించుకోవాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న పేదవారి కలలు సుదూర ప్రాంతాల్లో కానరావడంలేదు. పథకం ప్రారంభంలో ఉన్న ఉత్సాహం క్షేత్రస్థాయిలో అమలులోకి వచ్చే సరికి కనిపించడంలేదు. తాము సూచించిన యాప్‌ద్వారానే లబ్ధిదారులను నమోదు చేయాలని చెబుతూ హౌసింగ్ స్కీమ్‌పై కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తాము ఇందిరమ్మ యాప్‌లో పకడ్బందీగానే నమోదు చేశామని చెప్తుండటం చివరకు ఈ వాదనలు ఏ మలుపు తీసుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ పథకం అమలు తీరులో మాత్రం మందగమనం నెలకొంది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుకింద ఎంపిక చేయడంతోపాటు తొలివిడతలో పలువురు లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలో ఇళ్ల కోసం 3,18,435మంది అర్జీలు సమర్పించారు. 1,36,821మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో జిల్లాలో 3,939మంది లబ్ధిదారులను తొలివిడతగా ఎంపిక చేశారు. కాగా వీరిలో కొందరు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. కానీ, ప్రస్తుతం వీరిలో అనర్హులు ఎక్కువమంది ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో రీ వెరిఫికేషన్ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు రీ వెరిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనర్హులు ఉంటే ఇచ్చిన మంజూరీ పత్రాలను సైతం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో ఉండటం, ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని వారిగురించి అధికారులు ఆరా తీస్తున్నారు. మంజూరు అయినా అనర్హులు ఉన్న పక్షంలో రద్దు చేయడం, మంజూరు పత్రాలను తిరిగి వెనక్కి తీసుకోనున్నారు. పథకంలో అర్హులనే ఎంపిక చేస్తామని అనర్హులు ఉన్న పక్షంలో వారి మంజూరు పత్రాలు వెనక్కి తీసుకుంటామని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కాగా ప్రభుత్వం ఇలా రీ వెరిఫికేషన్ అనడంతో లబ్ధిదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
నిర్మాణాల్లో ఆలస్యం..
జిల్లాలో 3,939మంది లబ్ధిదారులు ఎంపిక కాగా 1,231 ఇళ్లు నిర్మాణానికి మంజూరు చేశారు. వీరిలో 350మంది నిర్మాణ పనులు ప్రారంభించారు. బేస్‌మెంట్ లెవల్‌లో 60 ఇళ్ల పనులు జరిగాయి. మిగతా ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేదు. ఇప్పటివరకు బేస్‌మెంట్ వరకు పనులు జరిగినా వారికి పైసా విడుదల కాలేదు. మంజూరీ పత్రాలు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా చాలా గ్రామాల్లో నిర్మాణపు పనులు ప్రారంభం కాలేదు. పైగా తిరిగి రీ వెరిఫికేషన్ చేస్తామని చెబుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
నారాయణఖేడ్: లబ్ధిదారుల ఎంపికకోసంవెరిఫికేషన్ చేస్తున్న అధికారులు (ఫైల్)
జిల్లాలో ఇళ్ల నిర్మాణ తీరు ఆది నుంచి తాత్సారమే
అనర్హులుంటే రద్దుకు ప్రభుత్వం చర్యలు!
కాగా ఇందిరమ్మ పథకం ప్రారంభం నుంచి వస్తున్న ఆదేశాలు, మార్గ దర్శకాలు అటు అధికారులు, ఇటు లబ్ధిదారులకు తలనొప్పిగా మారాయి. లబ్ధిదారు పాత ఇంటిని ఆనుకొనిగానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ, కొంతవరకు కూల్చి వేసిన వాటికి గానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయకూడదు. ఇళ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. ఒక ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేసిన తర్వాత బేస్‌మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలంలో ఫొటో తీయాలి. ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్‌లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. రెండు గదులు, ఒక వంటగది, బాత్‌రూం ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి. ప్రతీ దశలోనూ ఫొటో తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ఆశించిన చాలామంది లబ్ధిదారులకు పథకం ప్రారంభం నుంచి వస్తున్న సందేహాలు, ఆదేశాలతో అమలు మందగిస్తుంది. ఇందిరమ్మ పథకం ప్రారంభం నుంచి వస్తున్న ఆదేశాలు, మార్గదర్శకాలు అటు అధికారులు, ఇటు లబ్ధిదారులకు తలనొప్పిగా మారింది.

సొంతిల్లు కలేనా!