తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ? | - | Sakshi
Sakshi News home page

తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?

Mar 15 2025 7:42 AM | Updated on Mar 15 2025 7:42 AM

తప్పు

తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎక్కడ చూసినా ఇదే తంతు..వినియోగదారులు నిత్యం నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు తూకాల్లోనే కాదు. వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నాయి. ఇక్కడ లీటరంటే..950 ఎం.ఎల్‌..కిలో అంటే 900 గ్రాములే. నిబంధలను తుంగలో తొక్కి రకరకాల జిమ్మిక్కులతో వినియోగదారులను నిండా ముంచుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిత్యం తనిఖీలు చేస్తూ కఠినమైన కేసులు నమోదు చేసి...అనుమతులు రద్దు చేయాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో వదిలేయడం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

పత్తి రైతుల నిలువు దోపిడీ..

పత్తి రైతులు తమ పత్తిని జిన్నింగ్‌ మిల్లుల్లో కాంటాలు వేస్తుంటారు. సీజను ప్రారంభానికి ముందు ఈ కాంటాలను అధికారులు తనిఖీలు చేయాలి. ఆకస్మిక తనిఖీలు కూడా జరపాలి. ఏటా ఈ ప్రక్రియ జరగాల్సి ఉండగా...ఈ కాంటాల జోలికి అధికారులు వెళ్లకపోవడంతో పత్తి రైతులు తూకాల మోసాలకు గురవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు మోసాలకు పాల్పడే మిల్లులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి.

సదాశివపేట పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం మీటర్‌లో జిమ్మిక్కులు చేసింది. మీటర్‌ రీడింగ్‌ జీరో నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, రూ.2.50ల నుంచి ప్రారంభమయ్యేలా మార్పు చేసి వినియోగదారులను రోజుకు రూ.వేలల్లో దోపిడీకి గురి చేసింది. దర్జాగా ఈ దోపిడీ ఏళ్ల తరబడి సాగినా... తూనికల కొలతలు అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. వినియోగదారులు ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా కేవలం రూ.35 వేలు జరిమానా వేసి వదిలేశారు.

ఇక్కడ లీటరంటే..950 ఎం.ఎల్‌..కిలో అంటే 900 గ్రాములే!

మీటర్ల ట్యాంపరింగ్‌లు..ప్యాకింగ్‌ల్లో మోసాలు

నిలువునా దోపిడీకి గురవుతున్న వినియోగదారులు

ఆకస్మిక తనిఖీలకు మంగళం పాడిన అధికారులు

ఆధారాలతో ఫిర్యాదులు చేసినా నామమాత్ర జరిమానాలతో సరి

చిరు వ్యాపారులపైనే ప్రతాపం...బడా సంస్థల జోలికెళ్లని అధికారులు

విమర్శలకు దారితీస్తున్న తూనికల కొలతల శాఖ పనితీరు

80% కేసులు చిరు వ్యాపారులపైనే..

తూనికల కొలతల అధికారులు ఎప్పటికప్పుడు వ్యాపార, వాణిజ్య సంస్థలను తనిఖీలు చేయాలి. కేవలం తూకాల్లో మోసాలే కాదు. ప్యాకింగ్‌లో ఉన్న సరుకుల బరువులను పరిశీలించాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము ఇన్‌చార్జి బాధ్యతల్లో బిజీగా ఉన్నామంటూ దాటవేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. సొంతంగా దాడులు నిర్వహించిన కేసులు నమోదు చేసిన ఘటనలు కూడా తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిలో 102 కేసులు నమోదు చేసినట్లు చెప్పుకొస్తున్న అధికారులు ఇందులో 80 శాతానికి పైగా కేసులు చిరువ్యాపారులపైనే నమోదు చేయడం గమనార్హం. రకరకాల జిమ్మిక్కులతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్న బడా వ్యాపార సంస్థల జోలికి వెళ్లకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫిర్యాదులు వస్తే కేసులు

ఫిర్యాదులు వస్తే వెళ్లి కేసులు నమోదు చేస్తున్నాం. ఏడాదిలో 102 కేసులు పెట్టాం. ఇందులో చిన్న చిన్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా తూనికలు, కొలతల్లో తేడాలు ఉన్నట్లు గమనిస్తే మాకు ఫిర్యాదు చేస్తే వెళ్లి తనిఖీలు చేస్తాం. నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తాం.

– అనిల్‌కుమార్‌,

జిల్లా లీగల్‌ మెట్రాలజీ ఆఫీసర్‌, సంగారెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రముఖ రిటైల్‌ మాల్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ ప్యాకెట్‌పై రూ.20 డిస్కౌంట్‌ పేరుతో స్టిక్కరింగ్‌ వేసి... బిల్లు మాత్రం పూర్తిస్థాయిలో వేసి వినియోగదారులను మభ్య పెట్టారు. ఇలా మాల్‌కు నిత్యం వచ్చే వేలాదిమంది వినియోగదారులను మోసం చేస్తోంది. ఫిర్యాదు చేస్తేనే తూనికల కొలతల అధికారులు గుట్టు చప్పుడు కాకుండా నామమాత్రంగా జరిమానాతో చేతులు దులుపుకున్నారు.

తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?1
1/3

తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?

తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?2
2/3

తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?

తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?3
3/3

తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement