నీటి గంట మోగిద్దాం | - | Sakshi
Sakshi News home page

నీటి గంట మోగిద్దాం

Mar 15 2025 7:40 AM | Updated on Mar 15 2025 7:41 AM

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): వేసవికాలం నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ మోగాల్సిన అవసరం ఉంది. ఎండాకాలం వచ్చిదంటే చాలు నాలుక తడారిపోతుంది. గుక్కెడు నీరు తాగితే బాగుండు అనిపిస్తుంది. ఒక్కోసారి సమయానికి తాగునీరు దొరకదు. పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం పాఠశాలలకు వెళ్లే పిల్లలు చాలా మంది ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకోరు. ఒక వేళ తెచ్చుకున్నా.. తాగడానికి సమయం దొరక్కపోవడం, కంటిన్యూగా తరగతులు జరిగినప్పుడు మధ్యలో వెళ్లి తాగలేని పరిస్థితి ఉంటుంది. దీంతో డీ హైడ్రేషన్‌కు గురవుతారు. రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ మోగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ఐదేళ్లుగా మరిచారు

జిల్లాలో 2019 నవంబరులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ కార్యక్రమాన్ని అమలు చేశారు. కొవిడ్‌ తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ చాలా రోజులు, భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత వంటి నియమాలతో దృష్టి పెట్టలేదు. కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకొని అమలు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రతీ రోజు మూడు సార్లు..

ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో రోజూ మూడు సార్లు వాటర్‌ బెల్‌ మోగించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బెల్‌ కొట్టినప్పుడు ప్రతీ విద్యార్థి నీరు తాగేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించేవారు. మినరల్‌ వాటర్‌ లేని పాఠశాలల్లో ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించారు. నిర్ణీత రోజుల్లో ట్యాంకులు శుభ్రం చేయడం, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అనుమానం వస్తే నీటి పరీక్షలు నిర్వహించడం వంటివి గతంలో జరిపారు. ప్రస్తుతం పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ మోగించడంపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవికాలం నేపథ్యంలో ఇప్పటికై నా పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ మోగించడానికి అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.

ఆరోగ్యంగా ఉండడానికి తగినంత నీరు అవసరం

వేసవి నేపథ్యంలో విద్యార్థులకు తప్పనిసరి

పాఠశాలల్లో అమలు చేయాలి

వైద్యులు, విద్యావేత్తల సూచన

జిల్లాలో విద్యనభ్యసిస్తున్న 1.30 లక్షల మంది విద్యార్థులు

చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లయితే పక్కాగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఖచ్చితంగా అమలు చేస్తాం.

– వెంకటేశ్వర్లు, డీఈఓ సంగారెడ్డి

నీరు తక్కువైతే అనారోగ్యం

పిల్లలు ఆటలో పడి నీళ్లు తక్కువ తాగితే దుష్పలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాఠశాల సమయంలో 1.5 లీటర్ల మేర నీరు తీసుకుంటే మేలు. ఎక్కువ సార్లు మూత్రశాలకు వెళ్లాల్సి వస్తోందన్న కారణంతో తాగడం లేదు.సరైన మోతాదులో నీరు తాగకపోవడం వల్ల జ్వరంమూత్రపిండాల్లో రాళ్లు, మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, కాలేయం, చర్మ, జీర్ణ సంబంధిత సమస్యలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. సరిపడా మంచినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

– శ్రీనివాస్‌ రెడ్డి, పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement