
శారీరక దారుఢ్యం కీలకం
జోగిపేట(అందోల్): పోలీసు శాఖలో శారీరక దారుఢ్యం చాలా కీలకమని ప్రతీరోజు వ్యాయామం చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. జోగిపేటలోని పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల పరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. సైబర్ నేరాలు, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా పోలీసు స్టేషన్, సర్కిల్ కార్యాలయ ఆవరణను పరిశీలించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనాల తనిఖీ, నాకాబందీ, స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి అనుమానిత వ్యక్తులను, వాహనాలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండాలని, కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వహించాలన్నారు. జోగిపేట పోలీస్‌స్టేషన్ పరిశీలనలో సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ విజయ్ కృష్ణ, జోగిపేట స్‌ఐ పాండు, సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు.
ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎస్పీ
సంగారెడ్డి జోన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్ ఆంథోని పాఠశాల పరీక్ష కేంద్రాలను బుధవారం ఎస్పీ పరితోష్ పంకజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఈ నెల 6 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద (144) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు గుంపులుగా సంచరించేందుకు వీలులేదన్నారు. 100 మీటర్ల దూరం వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ ఓపెన్ చేయకూడదని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
జోగిపేట పోలీస్‌స్టేషన్ ఆకస్మిక తనిఖీ