
రామాయంపేట(మెదక్): ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని చాలెంజ్ చేసిన ఇదే పార్టీకి చెందిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఒకరు గుండు కొట్టించుకున్న ఉదంతమిది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పరిశీలకులు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి పార్టీ పరంగా సర్వేలో భాగంగా కౌన్సిలర్ల అభిప్రాయాలు సేకరించారు.
ఈ మేరకు చైర్మన్ జితేందర్‌గౌడ్‌తోపాటు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని, కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ వస్తుందని, తాను స్వయంగా పట్టణంలో పర్యటించగా ఈ విషయం తెలిసిందని 8వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ పరిశీలకుడితో వాగ్వాదం చేశారు. ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో మెజారిటీ వస్తే తాను గుండు కొట్టించుకొని గడ్డం, మీసాలు తీసి వేస్తానని చాలెంజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం బీఆర్‌ఎస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందని తెలుసుకున్న సదరు కౌన్సిలర్ గంగాధర్ అన్న మాటను నిలబెట్టుకున్నారు.