Special Story: ఇంధన సంక్షోభం: ప్రత్యామ్నాయాలు, ప్రయోజనాలు

Sakshi special story on Energy Crisis alternative Ethanol and benefits

భూమిలోని క్రూడ్ ఆయిల్‌ నిల్వలు అయిపోతే ఏం చేయాలి? అందుకే ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్ని దేశాలు అన్వేషిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కొద్ది కొద్దిగా వాడుతున్న ఇథనాల్‌ వినియోగం పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు ఇథనాల్‌ దేని నుంచి తయారవుతుంది? దాని వల్ల మేలు జరుగుతుందా? సమాజానికి నష్టమా? 

• సకల చరాచర జగత్తు ఇంధనం మీదే ఆధారపడి నడుస్తోంది..
• భూమిలో లభిస్తున్న క్రూడ్ ఆయిల్‌ అయిపోతే..?
• మానవాళి మనుగడే ప్రశ్నార్థకం కాదా?
• ఈ ప్రశ్నలనుంచి ఉద్భవించిందే ప్రత్యామ్నాయ ఇంధనం..
•పెట్రోలియంకు బదులుగా తయారు చేసుకుంటున్నదే ఇథనాల్‌..

చెరకు నుంచి పంచదార, బెల్లం తయారు చేసుకుంటాం. చెరకు పిప్పి నుంచి ఆల్కహాల్‌, మొలాసిస్ తయారవుతాయని కూడా మనకు తెలుసు. బియ్యం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం. మొక్కజొన్నలు కాల్చుకుని వేడి వేడిగా తింటాం. సినిమా థియేటర్లలో పాప్‌కార్న్‌ పేరుతో వందల రూపాయలు ఖర్చుపెడతాం. కాని ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు పదార్థాల నుంచి ఇంధనం తయారవుతుందంటే నమ్మగలమా? నమ్మాల్సిందే.. 2013 నుంచే మన దేశంలో కూడా చెరకు, బియ్యం, మొక్కజొన్నల నుంచి తయారవుతున్న జీవ ఇంధనాన్ని పెట్రోల్‌లో కొద్ది కొద్దిగా కలుపుతున్నారు. మనకు ఆ విషయం తెలియదు. ప్రపంచమంతా ఇప్పుడు జీవ ఇంధనం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ మారకద్రవ్యం ఆదా చేసుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, వేగంగా అంతరించిపోతున్న ముడిచమురు నిల్వల్ని మరికొంత కాలం అదనంగా లభించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలతో ప్రపంచమంతా జీవ ఇంధనం తయారీ దిశగా అడుగులు వేస్తోంది.

భూమి మీద కొన్ని దేశాల్లోనే క్రూడ్‌ ఆయిల్‌ లభిస్తుంది. వాటి నుంచే మిగిలిన ప్రపంచమంతా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న అమెరికా...అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అంటే నమ్మగలమా? అమెరికా తర్వాత రష్యాలోనే అధిక చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న పెట్రోల్, డీజిల్‌లో 82 శాతం ఆయిల్‌ రిచ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనదేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 18 శాతం మాత్రమే. మనం వాడే గ్యాస్‌లో 45 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. 202122 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు, గ్యాస్‌ కోసం 119 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తాన్ని మన రూపాయల్లో లెక్కిస్తే 95,166 కోట్ల రూపాయలు అవుతుంది.  ఆధునిక సమాజంలో ఇంధనం లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి తనలో దాచుకున్న ముడి చమురును ఎడా పెడా తోడేస్తున్నాం.

జనాభా పెరుగుతూ, అవసరాలు పెరిగే కొద్దీ సరికొత్త టెక్నాలజీతో చమురు తీసే వేగం కూడా పెరుగుతోంది. ఇలా భూమిలోని చమురును తోడేస్తూ ఉంటే 2052 నాటికి ముడి చమురు పూర్తిగా అంతరించిపోతుందనే అంచనాలు వేస్తున్నారు. అలాగే 2060 నాటికి సహజ వాయువు కూడా అదృశ్యమైపోతుంది. 2090 నాటికి బొగ్గు గనుల్లో బొగ్గు కూడా అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే మనిషి మనుగడ ఏంకావాలి? అందుకే నాలుగైదు దశాబ్దాల నుంచే ప్రత్యామ్నాయ ఇంధనం గురించి అన్వేషణ మొదలైంది. ఇప్పటికే గాలినుంచి, సూర్యుడి శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేస్తున్నాం. 50 ఏళ్ళకు పూర్వమే జీవ ఇంధనం వాడకం కూడా మొల్లగా మొదలైంది. జీవ ఇంధనం అంటే మొక్కల నుంచి తయారు చేసుకోవడమే. అన్ని రకాల మొక్కలూ ఇందుకు ఉపయోగపడవు. మనం ఆహారానికి ఉపయోగించే చెరకు, మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, ఇతర నిరుపయోగమైన ఆహార పదార్థాల నుంచి ఇథనాల్ అనే చమురును తయారు చేసే టెక్నాలజీ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది.

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇథనాల్. ఇథనాల్‌కు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన ఇథనాల్‌ ఉత్పత్తికి వాడే ముడి సరుకు ఏంటి? దాని వల్ల మానవాళికి ఏమైనా నష్టం జరుగుతుందా? పర్యావరణానికి మేలు జరుగుతుందా? 

భూమిలోని చమురు అయిపోతుండటం ఒక కారణం కాగా...చమురు నిల్వలు లేని దేశాలు వాటిని దిగుమతి చేసుకోవడానికి చెల్లించే విదేశీ మారకద్రవ్యం బిల్లులు ఏటేటా పెరిగిపోతుండటం కూడా ప్రత్యామ్నాయ ఇంధనం అన్వేషణకు కారణమైంది. అదే సమయంలో ప్రస్తుతం మనం వాడే పెట్రోల్‌, డీజిల్‌ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. కర్బన పదార్ధాల వల్ల భూమి, పర్యావరణం వేడెక్కి రుతువులు గతి తప్పుతున్నాయి. జీవ ఇంధనం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఇలా అనేక కారణాలతో ప్రపంచమంతా ఇథనాల్‌ని ప్రత్యామ్నాయ ఇంధనంగా తయారు చేసుకుంటోంది. చమురు నిల్వల్లో అగ్రభాగాన ఉన్న అమెరికానే ఇథనాల్‌ ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా చెరకు నుంచి ఇథనాల్ తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టిన బ్రెజిల్‌ ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. చెరకు ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్‌ వన్‌గా ఉన్న బ్రెజిల్‌ చాలా తక్కువ ఖర్చుతో ఇథనాల్‌ తయారు చేసుకుంటోంది. 

-ఈవీ బాలాజీ, సాక్షి

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top