Recap 2022: రాజకీయ రంగస్థలంలో కీలక ఘట్టాలు

Recap 2022 Important Elections Events In Indian Politics In 2022 - Sakshi

రాజకీయాలు అంటేనే ఎన్నో మలుపులు, ఆకస్మిక నిర్ణయాలు, అనూహ్య ఫలితాలు, ఫిరాయింపులు, తిరుగుబాట్లుతో ఎప్పడికప్పుడు రక్తికట్టిస్తాయి. అలాంటి కీలక మలుపులకు కేరాఫ్‌గా నిలిచింది 2022. ఈ సంవత్సరంలో రాజకీయాల్లో నెలకొన్న కొన్ని కీలక ఘట్టాలు భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. 2022 ఏడాది పూర్తి చేసుకుని 2023లోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ ఏడాది దేశంలో జరిగిన కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం.

ఉత్తరాఖండ్‌ సంప్రదాయానికి బీజేపీ చెక్‌: ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది బీజేపీ. ఎగ్జిట్‌ పోల్స్‌ హంగ్‌ ఏర్పడుతుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అవసరమైన మెజారిటీని సాధించింది. ఫిబ్రవరి 14న మొత్తం 70 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లు సాధించి అధికారం ఛేజిక్కించుకుంది. పుష్కర్‌ సింగ్‌ ధామీ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

బీజేపీదే గోవా: గోవాలో ఫిబ్రవరి 14న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోమారు అధికారం ఛేజిక్కించుకుంది. మొత్తం 40 స్థానాలకు గానూ బీజేపీ 20 సీట్లు సాధించింది. దీంతో ప్రమోద్‌ సావంత్‌ రెండోసారి సీఎం పదవి చేపట్టారు.

మణిపూర్‌లో బీజేపీ ఘనవిజయం: ఈ ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో జరిగిన మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా 32 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రధాన పాత్ర పోషించిన ఎన్‌. బిరేన్‌ సింగ్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

పంజాబ్‌లో ఆప్‌ పాగా: జాతీయ పార్టీగా అవతరించాలనే లక్ష్యంగా సాగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 20న మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 92 సీట్లు సాధించింది దేశం దృష్టిని ఆకర్షించింది. ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రిగా మార్చి 16న ప్రమాణ స్వీకారం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగా హవా: ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హవా కొనసాగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో మొత్తం 403 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 255 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి సీఎం పదవి చేపట్టారు.

షిండే తిరుగుబాటు: ఈ ఏడాది మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిణామాలు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబావుట ఎగురవేయడంతో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) కూటమి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. షిండే వర్గం బీజేపీతో చేతులు కలపడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూన్‌ 30న ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో పరిణామాలు వాడీవేడీగానే కొనసాగుతున్నాయి. శివసేన పార్టీ తమదంటే తమదని ఇటు షిండే వర్గం, అటు ఉద్ధవ్‌ వర్గం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

రాష్ట్రపతిగా తొలి గిరిజన మహిళా: దేశ చరిత్రలోనే తొలిసారి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌, ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగానూ చరిత్ర సృష్టించారు ముర్మూ. జులై 18న జరిగిన ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌: ఈ ఏడాది ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌.. భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మార్గరేట్‌ అల్వాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 710 ఓట్లలో 528 సాధించారు.

బిహార్‌లో కొత్త కూటమి: మహారాష్ట్రను మించిన ట్విస్టులు బిహార్‌ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. కూటమిలో నెలకొన్న విభేదాల కారణంగా బీజేపీకి షాక్‌ ఇస్తూ విపక్ష ఆర్‌జేడీతో చేతులు కలిపారు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. జేడీయూ, ఆర్‌జేడీ కలిసి కొత్త కూటమిగా ఏర్పడంతో పాటు రెండు రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆగస్టు 10న నితీశ్‌ కుమార్‌ మళ్లీ సీఎం పీఠం అధిరోహించారు.

ఓపీఎస్‌ వర్సెస్‌ ఈపీఎస్‌:  తమిళనాడులో అధికారం కోల్పోయిన తర్వాత ఆల్‌ ఇండియా అన్న ద్రావిడ మున్నెట్ర కళగం(ఏఐఏడీఎంకే)లో చీలికలు ఏర్పడ్డాయి. ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్‌) నేతృత్వంలో జరిగిన జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఓ పన్నీరు సెల్వం(ఓపీఎస్‌)ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. పార్టీ జనరల్‌ సెక్రెటరీ పదవి ఈపీఎస్‌కు దక్కెలా నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. 

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర: కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్‌ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. భారత్‌ జోడో యాత్ర పేరిట తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌లోని శ్రీనగర్‌ వరకు 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్‌ 8న ఈ యాత్ర ప్రారంభమైంది.

హిమాచల్‌ను లాగేసిన కాంగ్రెస్‌: నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అధికారాన్ని లాగేసుకుంది కాంగ్రెస్‌ పార్టీ. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 40 సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ నేత సుఖ్విందర్‌ సింగ్‌ సుఖూ హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ 25 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 

గుజరాత్‌లో బీజేపీ రికార్డులు: 25 ఏళ్లకుపైగా గుజరాత్‌ను శాసిస్తోంది బీజేపీ. డిసెంబర్‌లో రెండు దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సునామి సృష్టించింది. మొత్తం 182 సీట్లకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. గుజరాత్‌ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ రెండోసారి పదవి చేపట్టారు.

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top