● శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు
● నిర్దవెళ్లిలో కులమతాలకు అతీతంగా ఉత్సవాలు
కేశంపేట: మండల పరిధిలోని నిర్దవెళ్లిలో ముస్లింలు మతసామరస్యం చాటారు. శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరంలో నిర్వహించిన ఉత్సవాల్లో అందరితో కలిసిపోయారు. స్వామివారి కల్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమంలో పాల్గొని హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ చెదురువెళ్లి భాస్కర్‌గౌడ్ మాట్లాడుతూ.. పల్లెల్లోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉమాపతి, పల్లాటి కృష్ణయ్య, మైనార్టీ నాయకులు మక్బూల్, జబ్బార్‌ఖాన్, జాహేద్, పాష, బదృద్దీన్, అమేర్, మెహిజ్, అజహర్, గ్రామస్తులు సురేందర్, రంగయ్య, వెంకటయ్య, నారాయణరెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.


