స్వీయ విగ్రహావిష్కరణ
మొయినాబాద్: ఏడాది క్రితం మరణించిన భార్య విగ్రహంతోపాటు తన విగ్రహాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు రైతు కళ్లెం నర్సింహారెడ్డి. మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో ఉన్న కళ్లెం నర్సింహారెడ్డి వ్యవసాయ కళాక్షేత్రంలో శుక్రవారం తన కూతుళ్లు, బంధువులు, స్నేహితుల సమక్షంలో స్వయంగా ఆయనే విగ్రహాలను ఆవిష్కరించారు. ముప్‌పై ఏళ్ల పాటు అమెరికాలో వ్యవసాయం చేసి ఉత్తమ అవార్డు అందుకున్న నర్సింహారెడ్డి 2005లో స్వదేశానికి వచ్చి చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో వ్యవసాయ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. గత సంవత్సరం భార్య లక్ష్మి మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమెను ఒంటరిగా ఉంచలేనంటూ తన విగ్రహాన్ని సైతం పక్కనే ఏర్పాటు చేశారు. శుక్రవారం విగ్రహాల ఆవిష్కరణ చేసిన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.


