తొలిపోరులో హస్తం హవా!
పోరాడి ఓటమి పాలైనబీఆర్‌ఎస్ అభ్యర్థులు
ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసిన బీజేపీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు.. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. మెజార్టీ స్థానాల్లో వారికి ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, కేశంపేట్, నందిగామ, కొత్తూరు మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండల పరిధిలోని మొత్తం 168 సర్పంచ్ స్థానాలు, 1,340 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. ఇక వికారాబాద్ జిల్లాలో 262 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, 35 పంచాయతీల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగినప్పటికీ మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
రెండు సార్లు రీకౌంటింగ్
ఫరూఖ్‌నగర్ మండలం శేరిగూడ పంచాయతీ ఎన్నికల్లో రెండుసార్లు రీ కౌంటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ శారద, బీఆర్‌ఎస్ బలపరిచిన సమీప ప్రత్యర్థి విజయమ్మపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు


