ప్రచారం జోరు.. నేతలే లేరు
● పంచాయతీ ఎన్నికల్లో కనిపించని రాజకీయ నాయకులు
● చేవెళ్లలో సర్పంచ్ అభ్యర్థులకుదక్కని మద్దతు
చేవెళ్ల: గ్రామ పంచాయతీ ఎన్ని కల ప్రచారాల జోరు మీదుంటే రాజకీయ నాయకులు మాత్రం మౌనముని పాత్రలో ఉండి పోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కడా ఏ పార్టీ నాయకులు తమ మద్దతుదారులను ఈ సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రకటించటం కానీ, ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కనిపించటం లేదు. అభ్యర్థులు మాత్రం జోరుగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో రెండో విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఆయా గ్రామాల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు పోటీలో ఉన్నప్పటికీ ఎక్కడా మాది పలాన పార్టీ అని స్పష్టంగా చెప్పుకోవటం లేదు. గ్రామంలో మాకు అన్నివర్గాల వారు మద్దతు ఇస్తున్నారని అభ్యర్థులు సైతం తమ పార్టీలను పక్కన పెట్టారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు నిశబ్దంలో ఉండిపోయాయి. కొన్ని గ్రామాల్లో మాత్రం తమ అభ్యర్థులుగా చెప్పుకొంటున్నా వారి వెంట ప్రచారం మాత్రం పార్టీ నాయకులు చేయడం లేదు.
నిశ్శబ్దంలో రాజకీయ పార్టీలు
నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి, జిల్లా, మండలాల నాయకులుగా ఎంతోమంది ఉన్నా గ్రామాల్లో ప్రచారం చేయక పోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సైతం ఇదే పరిస్థితిలో మౌనం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను మాత్రం తమ పార్టీ వ్యక్తిగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలను మాత్రం ముందుగానే వెళ్లి తమ పార్టీ అభ్యర్థులే అని ప్రకటించుకొని శాలువాలు కప్పి సన్మానించారు. పోటీలో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని గుసగుసలాడుతున్నారు. ప్రజలకు తమ పార్టీల పేరు చెబితే ఓట్లు పడవనే భయంలో అభ్యర్థులు ఉండిపోయారని చర్చించుకుంటున్నారు.


