గ్లోబల్ కిటకిట
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం గురువారం విద్యార్థులు, సందర్శకులతో కిటకిటలాడింది. నగరంతో పాటు చుట్టు పక్క ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన స్టాళ్లను వీక్షించారు. వీరికి రోబోలు స్వాగతం పలికాయి. విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నెట్ జీరో స్టాల్, పోలీస్, డీఆర్‌డీఓ, హ్యాండ్లూమ్స్, స్కిల్స్ యూనివర్సిటీ, అగ్రికల్చర్, ఎయిరోస్పేస్, విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను, వాటి విశేషాలను తెలుసుకున్నారు. ప్రధాన వేదికపై నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విజన్ సాధిద్దాం..
సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ ఆధ్వర్యంలో జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, యునిసెఫ్ సలహాదారు డేవిడ్‌రాజ్, ప్రజ్వల సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ సునీతకృష్ణన్, సైకాలజిస్టు డాక్టర్ గీత చల్లా తదితరులు మహిళా సాధికాతరపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. యువత క్రీడలను ఓ వృత్తిగా ఎంచుకోవాలని గుత్తా జ్వాల సూచించారు. పోరాట పటిమతో ముందుకు సాగాలని సునీతాకృష్ణన్ సూచించారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, రీల్ లైఫ్‌కు, రియల్ లైఫ్‌కు తేడాను గుర్తించాలని డేవిడ్‌రాజ్ వివరించారు. తెలంగాణ చరిత్రకారుడు, సాంస్కతిక శాఖ మాజీ డైరెక్టర్ డా.మామిడి హరికృష్ణ, పి.పద్మావతి, బిరాద్ రాజారాం యాజ్ఞిక్, గోపి బైలుప్పల తదితరులతో చర్చాగోష్టి నిర్వహించారు.


