కరువైన బీమా ధీమా
షాబాద్: రైతుల సంక్షేమమే ధ్యేయమని ప్రభుత్వం ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. పాడి పశువులు అనారోగ్యం, ఇతర కారణాలతో మత్యువాతపడితే బీమా సౌకర్యం లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. బీమా ఉంటే ఆయా సంస్థల నుంచి గతంలో పశువు రకాన్ని బట్టి రూ.50 వేల వరకు పరిహారం అందేది. ప్రస్తుతం పథకాన్ని నిలిపివేయడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాడి పరిశ్రమే జీవనాధారం
జిల్లాలోని అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ జీవనాధారంగా మారింది. పెద్ద ఎత్తున వ్యవసాయంతో పాటు పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. డెయిరీలు ఏర్పాటు చేసుకొని పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
ముగిసిన సబ్సిడీ గొర్రెల బీమా
నాలుగేళ్ల క్రితం కొత్తగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకానికి గత ప్రభుత్వం మొదటిసారి బీమా సౌకర్యం కల్పించింది. గొర్రెలు పంపిణీ చేసిన ఏడాది తర్వాత బీమా ముగిసింది. తరువాత రెన్యూవల్ చేయకపోవడంతో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు ప్రస్తుతం రెండో విడతలో ఇస్తున్న గొర్రెలకు ఏడాది పాటు బీమా సౌకర్యం కల్పించింది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో పాటు, రైతుల వద్ద ఉన్న గేదెలు, ఎద్దులు, ఆవులకు సైతం ఎప్పటిలా 50 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పశుబీమా పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అటకెక్కిన పశువుల బీమా పథకం
ఆర్థికంగా నష్టపోతున్న రైతులు
పట్టించుకోని పాలకులు


