
సన్నాలకు బోనస్ సున్నా
● సన్నవడ్లకు జమ కానిప్రోత్సాహకం డబ్బులు ● నెలల తరబడి ఎదురుచూస్తున్న అన్నదాతలు ● నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ● జిల్లాలో పండించిన రైతులు : 2,744 మంది ● విక్రయించిన ధాన్యం : 13,700 మెట్రిక్ టన్నులు ● రైతులకు అందాల్సిన మొత్తం: రూ.6.85 కోట్లు
ఇబ్రహీంపట్నం రూరల్: రైతులను ప్రోత్సహించడం కోసం సన్నాలకు బోనస్ అని ప్రకటించిన ప్రభుత్వం ఈ మేరకు అందించడంలో తాత్సారం చేస్తోంది. ధాన్యం విక్రయించిన రైతులు డబ్బుల కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్ వరి కొనుగోలు చేయడం కోసం ఏప్రిల్ 20 నుంచి జూన్ 31 వరకు 30 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకొని 5,074 మంది రైతుల నుంచి 25 వేల మెట్రిక్ టన్నులు మార్కెటింగ్ శాఖ పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ల ద్వారా సేకరించారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు అదనంగా రూ.500 చెల్లించనున్నట్టు కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. దీంతో రైతులు విరివిగా పండించారు.క్వింటాలుకు రూ.2,320 మద్దతు ధర ప్రకటించగా మొత్తం రూ.58 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. బోనస్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతల ఆందోళన
ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బుల కోసం అన్నదాతలు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల వద్ద స్పష్టత లేకపోవడంతో బోనస్ ఇస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 2,744 మంది రైతులు 13,700 మెట్రిక్ టన్నుల సన్నవడ్లు పండించారు. ఈ ధాన్యం మొత్తం ప్రభుత్వమే సేకరించింది. ఈ మేరకు రైతులకు బోనస్‌గా రూ.6.85 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.
ఎదురుచూపులే..
సన్నాలకు ప్రోత్సాహ కం ఇస్తామని ప్రభు త్వం ప్రకటించడంతో చాలామంది రైతులు పుష్కలంగా పండించారు. ఇస్తామన్న బో నస్ నేటికీ ఇవ్వలేదు. ఎదురుచూపులు తప్ప డం లేదు. వెంటనే రైతుల గోడు పట్టించుకొని రావాల్సిన మొత్తం ఇవ్వాలని కోరుతున్నాం.
– మొద్దు అంజిరెడ్డి,
రాష్ట్ర ఉత్తమరైతు అవార్డు గ్రహీత
త్వరలో జమ అవుతాయి
మా శాఖ నుంచి చేయాల్సిన పనులు పూర్తి చేశాం. ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు నమోదు చేశాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. త్వరలో రైతులకు డబ్బులు అందుతాయి.
– వనజాత,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

సన్నాలకు బోనస్ సున్నా

సన్నాలకు బోనస్ సున్నా