
మాత్రలు వేద్దాం.. ‘నులి’మేద్దాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకటి నుండి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ విధిగా అల్బెండజోల్ మాత్రలు వేయించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11న అల్బెండజోల్ మాత్రలు అందజేయాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ మాత్రలపై అవగాహన కల్పించి, వందశాతం లక్ష్యం పూర్తయ్యేలా చూడాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆ ర్‌ఓ సంగీత, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, డీపీఓ సురేష్‌మోహన్, డీఈఓ సుశీందర్‌రావు పాల్గొన్నారు.
ప్రజావాణికి 82 ఫిర్యాదులు
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్‌ఓ సంగీతతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉపాధి కోసం డీఈఈటీ
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)ను ప్రారంభించిందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఈఈటీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు నిరంతర ఉపాధి కల్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన డీఈఈటీ వెబ్‌సైట్‌ను గత సంవత్సరం డిసెంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. నిరుద్యోగులు ఈ వెబ్‌సైట్‌లో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు వారి నైపుణ్యం, విద్యార్హత, నివాసం మొదలైన వాటి ఆధారంగా ఉద్యోగ సమాచారం అందించబడుతుందన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్‌ఓ సంగీత పాల్గొన్నారు.