లైన్‌ క్లియర్‌ | - | Sakshi
Sakshi News home page

లైన్‌ క్లియర్‌

Jul 22 2025 9:05 AM | Updated on Jul 22 2025 9:05 AM

లైన్‌

లైన్‌ క్లియర్‌

వికారాబాద్‌ – కృష్ణా రైల్వే లైన్‌కు మోక్షం

కొడంగల్‌: వికారాబాద్‌ – కృష్ణా రైల్వే లైన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. సర్వే పనులు పూర్తయ్యాయి. వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మీదుగా కృష్ణా వరకు నూతనంగా రైలు మార్గం ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఈ మార్గాన్ని కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌ వరకు పొడిగించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. వికారాబాద్‌ జంక్షన్‌ నుంచి నారాయణపేట జిల్లా కృష్ణా వరకు సుమారు రూ.2వేల కోట్ల వ్యయంతో 122 కిలోమీటర్ల దూరం రైలు మార్గం వేయనున్నారు. భూసేకరణ, సాంకేతిక, ఆర్థిక అంశాలపై అధికారులు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తున్నారు. నెల రోజుల్లో డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొడంగల్‌ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం కృషి చేశారు. చివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్‌ మీదుగా కొత్త రైల్వే లైన్‌కు మార్గం సుగమం అయ్యింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని సీఎం లేఖ రాసినట్లు తెలిసింది. తుది సర్వేలో రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఏఏ ప్రాంతాల మీదుగా రైలు మార్గం నిర్మించాలి.. రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడ ఉండాలి.. ఎంత భూమి అవసరం.. వంతెనలు ఎక్కడ అవసరం.. అటవీ, పట్టా, ప్రభుత్వ భూములు.. పర్యావరణం తదితర అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. మొదటి, రెండు దశల్లో చేసిన సర్వేకు కొద్దిగా మార్పులు చేసి కొడంగల్‌ పట్టణ శివారులో తాండూరు రోడ్డుకు సమీపంలో కొడంగల్‌ రైల్వే స్టేషన్‌కు రూపకల్పన చేసినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లభించింది. ఈ రైల్వే లైన్‌ అందుబాటులోకి వస్తే జిల్లాలోని వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. నాలుగు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతంలో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులను ఇవ్వలేదు. దీంతో ఇన్నాళ్లు పెండింగ్‌లో పడింది. ఇటీవల సీఎం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులను వేగిరం చేయాలని కోరారు. దీంతో సర్వే పనులు తుది దశకు వచ్చాయి. వికారాబాద్‌ నుంచి పరిగి, కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల మీదుగా రాయిచూర్‌కు మార్గం వేయాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఫైనల్‌ సర్వే పూర్తి

కొడంగల్‌ మీదుగా మార్గం

అంచనా వ్యయం రూ. 2వేల కోట్లు

రైలు మార్గం పొడవు 122 కిలోమీటర్లు

తుది మార్గం: వికారాబాద్‌ – పరిగి – కొడంగల్‌ – దౌల్తాబాద్‌ – బాలంపేట – దామరగిద్ద – నారాయణపేట – మక్తల్‌ – కృష్ణా

కొడంగల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో

తాండూరు రోడ్డు సమీపంలో కొడంగల్‌

రైల్వే స్టేషన్‌ ?

46 ఏళ్లుగా నిరీక్షణ

కొడంగల్‌ మీదుగా రైల్వే లైన్‌ కోసం 1980 – 81 సంవత్సరంలో అప్పటి మహబూబ్‌నగర్‌ ఎంపీ, రైల్వేశాఖ సహయ మంత్రి మల్లికార్జున్‌ సర్వేకు ఆదేశించారు. వికారాబాద్‌ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్‌పేట, మద్దూరు, నారాయణపేట, ఊట్కూర్‌, మక్తల్‌, మాగనూర్‌ మీదుగా కృష్ణ వరకు రైల్వేలైన్‌ నిర్మాణానికి సర్వే కూడా చేశారు. కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మీదుగా లైన్‌ వేస్తే ఆదాయం వస్తుందని గణాంకాలను విశ్లేషిస్తూ ఆయా ప్రాంతాల ప్రజలు కేంద్రానికి నివేదిక పంపించారు. దీంతో కేంద్రం రెండో సారి సర్వే చేయించింది. కొడంగల్‌ మీదుగా రైల్వే లైన్‌ వేస్తే బాగుంటుందని నిపుణులు నివేదిక సమర్పించారు. అనంతరం జరిగిన పరిణామాలతో రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత జిల్లాల విభజన చేశారు. కోస్గి, మద్దూరు మండలాలు నారాయణపేట జిల్లాలోకి వెళ్లాయి. కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాలు వికారాబాద్‌ జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడంగల్‌ మీదుగా రైల్వే లైన్‌ వేస్తే జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుందని స్థానికులు పలు మార్లు కేంద్ర మంత్రులు, ఎంపీలు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

లైన్‌ క్లియర్‌1
1/1

లైన్‌ క్లియర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement