
పింఛన్ పెంచాల్సిందే..
ఆమనగల్లు: దివ్యాంగులు, ఆసరా పింఛన్‌దారులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. ఆగస్ట్ 13న హైదరాబాద్‌లో నిర్వహించే దివ్యాంగుల, ఆసరా పెన్షన్‌దారుల మహాగర్జన సభకోసం సోమవారం పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పింఛన్‌లు పెంచడం చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నా పింఛన్‌దారులకు ఇచ్చిన హామీ మేరకు పెంచలేకపోయారని విమర్శించారు. దివ్యాంగులకు రూ.6 వేలు, ఆసరా పెన్షన్‌దారులకు రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు అందించాలన్నారు. పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన రూ.20 వేల కోట్లు ఎవరికి దోచిపెట్టారని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడతామని, పెన్షన్‌దారులకు అందించాల్సిన మొత్తాన్ని పెంచేవరకు పోరాడతామని స్పష్టం చేశా రు. ఎమ్మార్పీఎస్ పోరాటం ద్వారానే రాజీవ్ ఆరో గ్యశ్రీ పథకం వచ్చిందని గుర్తుచేశారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక అమ లు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు నర్సింహమాదిగ, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు యాచారం జంగయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కావలి శ్రీశైలం, ఇతర నాయకులు పాల్గొన్నారు.
చేతకాకపోతే తప్పుకోండి
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించింది
న్యాయం జరిగే వరకు పోరాడుతాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ