
పేదల భూములు లాక్కోవద్దు
మొయినాబాద్: ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షల ఎకరాల పేదలకు పంచామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు పేదల భూములు ఎందుకు గుంజుకుంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనందర్‌గౌడ్ ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో రైతులు చేపడుతున్న రిలేదీక్షకు సోమవారం బీజేపీ, ఓబీసీ మోర్చా నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన 15 నెలల్లోని సీఎం నిజస్వరూపం బయటపడిందన్నారు. నమ్మి ఓట్లు వేస్తే వమ్ముచేశారని విమర్శించారు. విలువ పెరగడంతో ప్రభుత్వం కన్ను భూములపై పడిందన్నారు. నగరంలో ఉన్న గోశాల భూమి ఎకరం రూ.100 కోట్లు ధర ఉందని.. అక్కడ 50 ఎకరాల్లో ఉన్న గోశాలను ఎనికేపల్లికి తరలించి ఆ భూములను రూ.5,000 కోట్లకు అమ్ముకోవచ్చని చూస్తోందని ఆరోపించారు. నిజంగా ప్రభుత్వానికి భూములు అవసరమైతే రైతులను ఒప్పించి వారికి న్యాయమైన పరిహారం ఇచ్చి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆంజనేయులుగౌడ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ వెంకటేశ్‌గౌడ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్
ఎనికేపల్లి రైతులకు సంఘీభావం