
రైతులను గుర్తించని ప్రభుత్వం
ఇబ్రహీంపట్నం: రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వారికి గుర్తింపు కార్డుల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం వ్యవసాయ కార్యాలయం వద్ద గురువారం రైతులు, బీఆర్‌ఎస్ నేతలతో కలిసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతుల గుర్తింపు కార్డుల నమోదు పక్రియను ప్రారంభించి రెండున్నర నెలలు గడుస్తున్నా.. రాష్ట్రంలో పది శాతం నమోదును ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో మీ సేవా, తదితర కేంద్రాల్లో రైతుల గుర్తింపు కార్డుల నమోదు చేస్తుంటే, ఇక్కడ పట్టించుకునే నాథుడే కరువైయ్యాడని పేర్కొన్నారు. కేవలం వ్యవసాయ విస్తరణాధికారికి మాత్రమే ఆన్‌లైన్ లాగిన్ ఇవ్వడంతో సగటున రోజుకు 40 మందికి మించి నమోదు చేయలేకపోతున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డులు లేకుంటే రైతుభరోసా, రైతుబీమా, పీఎం కిసాన్ లాంటి పథకాలు నిలిచిపోతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో రైతు గుర్తింపు నమోదుకు అవకావం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు చిలుకల బుగ్గరాములు, నిట్టు జగదీష్, సుధాకర్‌రెడ్డి, నర్సింహ్మారెడ్డి, మైసయ్య, మహేందర్, గోపాల్,శంకరయ్య, చంద్రశేఖర్, శ్రీశైలం , శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
గుర్తింపు కార్డుల జారీలో తీవ్రజాప్యం
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి