
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
● కార్మికుల సమస్యల పరిష్కారంలోకేంద్రం విఫలం ● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు
షాద్‌నగర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, టీడబ్ల్యూజేఎఫ్, రైతుసంఘం, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలు, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్, జీపీ వర్కర్లు, ప్రజాసంఘాలు సమ్మెకు పూర్తి మద్ధతు తెలిపాయి. సమ్మెలో భాగంగా ఎంపీడీఓ కార్యా లయం నుంచి రైల్వేస్టేషన్, మెయిన్‌రోడ్డు, ముఖ్యకూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్మికవర్గం సమరశీల పోరాటాలద్వారా వందేళ్లలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందని అన్నారు. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను వెల్లదీస్తున్న కార్మికులకు కనీస వేతనం కింద రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమప్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఖాజాపాష, రాఘవేందర్‌గౌడ్, రమేష్‌కుమార్, నర్సింహారెడ్డి, నరేశ్, సీనయ్య, వెంకట య్య, నాయకులు రాజు, శ్రీనునాయక్, నర్సింలు గౌడ్, సాయిబాబు, ఈశ్వర్‌నాయక్, జయమ్మ, మల్లేశ్, జైపాల్‌రెడ్డి, గణేశ్, మల్లేశ్, సత్యం, కోటేశ్వర్‌రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.