
కారు ఇంజన్‌లో మంటలు
మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పక్కన భారత్ పెట్రోల్ పంపులో పెను ప్రమాదం తప్పింది. కారులో పెట్రోల్ పోయించుకుని వెళ్తుండగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతానికి చెందిన సుదర్శన్ తన క్విడ్ కారులో షాద్‌నగర్ నుంచి వచ్చి మైలార్‌దేవ్‌పల్లిలోని భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకున్నాడు. తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెట్రోల్ పంపు సిబ్బంది ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు.
ఫ్రిడ్జ్ పేలి గృహోపకరణాలు దగ్ధం
అమీర్‌పేట: ఫ్రిడ్జ్ పేలి ఇంట్లోని వస్తువులు కాలిపోయిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సనత్‌నగర్ రాజరాజేశ్వరీనగర్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన రవి భార్య, కుమారుడితో కలిసి రాజరాజేశ్వరి నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం భార్యా, భర్తలు నీళ్లు తెచ్చేందుకు కిందకు వెళ్లగా మూడో అంతస్తులోని వారి ఇంట్లో ఫ్రిడ్జ్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో పేలిపోయింది. మంటలు ఇంట్లో ఉన్న సామగ్రికి వ్యాపించడంతో కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక ఫ్రిడ్జి కంప్రెషర్ పేలి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉందని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు తెలిపారు.
బీటెక్ విద్యార్థి ఆత్యహత్య
సికింద్రాబాద్: మానసిక సమస్యలతో బాధపడతున్న బీటెక్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఘట్‌కేసర్–బీబీనగర్ రైల్వేస్టేషన్ల చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ పండరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, బెల్లెపల్లికి చెందిన చీర సాయిప్రకాశ్ (22) నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న అతను బుధవారం రాత్రి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం
కాచిగూడ: గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ, కృష్ణానగర్ నాలాలో గుర్తుతెలియని వ్యక్తి (45) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.