
హై లెవల్ చేతికి పరిహారం!
యాచారం: ప్రజాప్రయోజనాల నిమిత్తం, వివిధ సంస్థలకు అప్పగించే భూసేకరణకు సంబంధించి సర్కార్ హై లెవల్ కమిటీని నియమించడానికి నిర్ణయించింది. ఇక నుంచి ఈ కమిటీ నిర్ణయం మేరకే భూములిచ్చే రైతులకు పరిహారం అందజేస్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని పది గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించడానికి నిర్ణయించి 14 వేల ఎకరాలు సేకరించింది. పట్టా భూములకు అందజేసిన పరిహారం విషయంలో ఇబ్బందులు రానప్పటికీ అసైన్డ్‌పట్టాలు, ప్రభుత్వ భూముల్లో కబ్జాలున్న రైతులకు అందజేసిన పరిహారం చెల్లింపులో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మొదట్లో అసైన్డ్ భూములకు సాగు యోగ్యమైన భూమికి మాత్రమే పరిహారం అందజేశారు. తర్వాత కొందరు అధికారులతో కుమ్మకై ్క పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న భూమికి మొత్తం నకిలీ పేర్ల మీద పరిహారం కాజేశారు. దీంతో నిజమైన అసైన్డ్‌దారులకు అన్యాయం జరిగింది. అన్యాయానికి గురైన అసైన్డ్‌దారులు నేటికీ తమను ఆదుకోవాలని కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అన్నీ నిర్ధారించాకే..
పరిహారం అందజేతలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. ఇక నుంచి జిల్లాలోని ఏ మండలం, ఏ గ్రామంలోనైనా ప్రజాప్రయోజనాలు, ప్రముఖ సంస్థలకు భూములు అప్పగించే విషయంలో హై లెవల్ కమిటీ నిర్ణయం మేరకే ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ, పరిహారం అందజేత, రైతులతో మాట్లాడి నచ్చజెప్పడం వంటి చర్యలు తీసుకోనుంది. కలెక్టర్ సారథ్యంలో ఏర్పాటయ్యే కమిటీలో అడిషనల్ కలెక్టర్, సర్వేశాఖ జిల్లా అధికారి, ఆర్డీఓ, తహసీల్దార్ ఉండనున్నారు. నిజమైన రైతులకు పరిహారం అందజేత విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, రెవెన్యూ రికార్డుల పరిశీలన, భూమికి సంబంధించి సర్వే మ్యాప్, హద్దుల నిర్ధారణ ద్వారా పరిహారం అందజేస్తారు.
250 ఎకరాలకు పైగా ..
యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని 250 ఎకరాలకుపైగా పరిహారం అందజేసేలా అధికారులు నిర్ణయించారు. ఫార్మాసిటీకి సేకరించిన భూములకు సంబంధించి తాజాగా అధికార యంత్రాంగం సర్వే, ఫెన్సింగ్ పనులు నిర్వహిస్తోంది. ఆయా గ్రామాల్లోని అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న రైతులు తమకు పరిహారం అందలేదని పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆయా గ్రామాల్లోని అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా కబ్జాలో ఉన్న భూముల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 80 మందికి పైగా రైతులు 250 ఎకరాలకుపైగా అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సర్కార్‌కు నివేదిక అందజేశారు. పరిహారం విషయంలో మరోసారి పొరపాట్లు జరగకుండా కలెక్టర్ సారథ్యంలో హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసి తర్వాతే బాధిత రైతులకు అందజేసేలా సర్కార్ దృష్టి సారించింది.
అవకతవకలు, అక్రమాలకు చెక్ పెట్టేలా సర్కార్ చర్యలు
కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీ
బృందంలో మరో నలుగురు..
ఇక నుంచి వారి నిర్ణయం మేరకే పరిహారం చెల్లింపు
అన్యాయం జరగకుండా చూస్తాం
ఫార్మాసిటీకి భూములు సేకరించిన గ్రామాల్లో కొందరికి పరిహారం అందలేదని గుర్తించాం. త్వరలో కలెక్టర్ సారథ్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటవుతుంది. కమిటీ నిర్ణయం ప్రకారం బాధిత రైతులకు పరిహారం అందజేస్తాం. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూస్తాం.
– అనంత్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం

హై లెవల్ చేతికి పరిహారం!