
పీఏసీఎస్‌ల సేవలు భేష్
నందిగామ: మండల పరిధిలోని చేగూరు పీఏసీఎస్‌ను మంగళవారం ఇండోనేషియా వ్యవసాయ అధికారుల బృందం సందర్శించింది. ఇండోనేషియా జాతీయ అభివృద్ధి ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఉప మంత్రి బాపక్ లీనార్డో, టాగ్ సంబాడో ఆధ్వర్యంలో 15 మంది సీనియర్ అధికారుల బృందం రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరా, ఆధార్ ఆధారిత పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణ, పారదర్శకత తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఏసీఎస్‌ల నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు ప్రేరణాత్మకంగా ఉన్నాయని కితాబిచ్చారు. వ్యవసాయ రంగంలో ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, ఇన్‌చార్జి ఏడీఏ నిశాంత్ కుమార్, ఏడీఏ మాధవి, ఏఈఓ రవి, డీసీసీబీ షాద్‌నగర్ మేనేజర్ మంకాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇండోనేషియా అధికారుల బృందం కితాబు