
మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్‌లో ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచ్చిన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్‌కు నచ్చజెప్పేందుకు యత్నించాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్‌ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్‌ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
సమీప బంధువు దారుణ హత్య
నడి రోడ్డుపై ఘాతుకం

మంచి మాటలు చెప్పినందుకు...