
హైసిటీ పనులకు నిధుల లేమి
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పనుల కింద టెండర్లు పూర్తయినప్పటికీ, పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కేబీఆర్‌పార్కు చుట్టూ, ఖాజాగూడ, ట్రిపుల్‌ఐటీ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు తదితర పనులకు సంబంధించి రూ. 1800 కోట్ల మేర పనులకు టెండర్లు పూర్తయ్యాయి. కేబీఆర్ చుట్టూ పనులకు కోర్టు వివాదాలతో ముందుకు సాగలేని పరిస్థితి నెలకొనగా, మిగతా ప్రాంతాల్లో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. అందుకు అవసరమైన నిధులు జీహెచ్‌ఎంసీ ఖజానాలో లేవు. అవసరమైన నిధులను ప్రభుత్వం ఇస్తే తప్ప ముందుకు పోలేని పరిస్థితి. సదరు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో భాగంగా ఆస్తులు కోల్పోయే నిర్వాసితులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 760 కోట్లకు సంబంధించిన పరిహారం ఖరారు, తదితరాలతో అవార్డులు పాసైనప్పటికీ, భూమిని స్వాధీనం చేసుకునేందుకు చెల్లించేందుకు నిధుల్లేవు.జీహెచ్‌ఎంసీకి చెందిన పబ్లిక్ డిపాజిట్ ఖాతా లోని రూ.2వేల కోట్లు సైతం ప్రభుత్వం వినియోగించుకోవడంతో జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయం సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారనుంది. ప్రస్తుతానికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా వచ్చిన నిధులతో ఇబ్బంది లేకపోయినప్పటికీ, మున్ముందు జీతాలకూ కటకటలాడాల్సిన పరిస్థితి తప్పదేమోనని జీహెచ్‌ఎంసీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పనులు అడుగు ముందుకు పడని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో ఎస్సార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలకు సైతం అప్పటి ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదు. కానీ, జీహెచ్‌ఎంసీ ఆర్థికపరిస్థితి, పరపతి దృష్ట్యా అప్పులు తెచ్చారు.
సర్కారు కరుణిస్తేనే ముందుకు
లేకుంటే అంతే సంగతులు