
డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు
షాద్‌నగర్: ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ఆర్టీసీ బస్సు డివైడర్ ఎక్కిన ఘటన షాద్‌నగర్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై రాయికల్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం సాయంత్రం సుమారు 40 మంది ప్రయాణికులతో మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. బస్సు షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌పైకి ఎక్కి కొంత దూరం వెళ్లి ఆగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మరో బస్సులో తరలించారు.