
క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: దేశానికి కావాల్సిన ఉత్తమ క్రీడాకారులను అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంతర్జాతీయ మాజీ కబడ్డీ క్రీడకారుడు, ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి జగదీష్ యాదవ్ పేర్కొన్నారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ పల్లె ఆణిముత్యాల సాధన శిబిరంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్‌లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగదీష్ యాదవ్ మాట్లాడుతూ.. క్రీడకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి దేశానికి ప్రతిభావంతులను అందించాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తోడ్పాటునందించాలన్నారు. ఫౌండేషన్ చైర్మన్ సదా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి సమాజానికి, దేశానికి అందించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, నల్లగొండ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భూలోక రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవికుమార్, సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, శాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.