
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చు
మహేశ్వరం: గుండె పోటు మరణాలు పెరుగుతున్నాయని, సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చునని జనత హృదయాలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మల్‌రెడ్డి హన్మంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి తుమ్మలూరు మ్యాక్ ప్రాజెక్టు బీటీఆర్‌లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీపీఆర్ ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. ఎవరైనా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర చికిత్స సీపీఆర్ అని తెలిపారు. ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చినప్పుడు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. ఫౌండేషన్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత శిబిరాలు నిర్వహించి, పేదలకు మేలు చేస్తున్నామని డాక్టర్ పేర్కొన్నారు. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంతోకొంత సేవ చేయాలనే లక్ష్యంతో ఉచితంగా వైద్య శిబిరాలు, పరీక్షలు, సీపీఆర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అంతకు ముందు నిర్వహించిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి ప్రాక్టికల్ శిక్షణ, థియరీ తరగతులను వివరించారు. కార్యక్రమంలో డెర్మటాలజీ వైద్యురాలు మేథినిరెడ్డి, బీటీఆర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కేర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు.
డాక్టర్ మల్‌రెడ్డి హన్మంత్‌రెడ్డి