
చికెన్ బిర్యానీలో బల్లి
ఇబ్రహీంపట్నంలో కలకలం రేపిన ఘటన
ఇబ్రహీంపట్నం: చికెన్ బిర్యానీలో బల్లి కనిపించిన సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఓ హోటల్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శేరిగూడ గ్రామానికి చెందిన జి.కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై గల ఏఆర్ మైఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్ బిర్యానీ భుజిస్తున్నాడు. అందులో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఖంగుతిన్నాడు. 100 డయల్ చేసి అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు రెస్టారెంట్‌ను సందర్శించి విషయాన్ని ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు దృష్టికి తీసుకొచ్చారు. పుడ్ ఇన్‌స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం హోటల్‌ను సందర్శించి తనిఖీ చేస్తానని తెలిపినట్లు మున్సిపల్ పర్యావరణ అధికారి ప్రణవ్ తెలిపారు. కాగా బిర్యానీలో బల్లి వచ్చిన సంఘటనపై ఫిర్యాదు అందిందని.. ఈ అంశాన్ని మున్సిపల్, ఫుడ్‌సేఫ్టి అధికారులే నిర్ధారించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపారు.
విద్యుదాఘాతంతో గేదె మృతి
ఇబ్రహీంపట్నం: కరెంట్ తీగలు తగలడంతో ఓ గేదె మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. అదే ఊరికి చెందిన నాంపల్లి లాలయ్యకు రెండు గేదెలున్నాయి. అతని వ్యవసాయ క్షేత్రంలో వాటిని మేత కోసం ఉదయం వదిలిపెట్టాడు. సమీపంలోని విద్యుత్ స్తంభానికి సపోర్టుగా ఉన్న తీగలు ఓ గేదె కాళ్లకు చుట్టుకున్నాయి. వాటిని విడిపించుకునే క్రమంలో విద్యుత్ తీగలకు తగిలి షాక్‌తో మృతి చెందింది. జీవనాధారం కోల్పోయానని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

చికెన్ బిర్యానీలో బల్లి