
ఫార్మా భూముల్లో పంటలొద్దు
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో వానాకాలం సాగు చేపట్టకుండా కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే భూ సర్వే, ఫెన్సింగ్ పనులు పూర్తి చేస్తున్న అధికారులు, ఆ భూముల్లో రైతులు సాగు చేస్తే కబ్జాల నుంచి కదిలించడం కష్టమనే భావనలో ఉన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు 2025 వానాకాలం పంటల సాగు చేయొద్దని రైతులకు వివరిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు యాచారం మండలంలోని ఫార్మాసిటీకి భూములు సేకరించిన నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నేరుగా భూములిచ్చిన రైతులను కలిసి చెప్పడంతో పాటు ఆయా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పంపుతున్నారు. ఇన్నాళ్లు ఫార్మాసిటీ భూముల పర్యవేక్షణను కేవలం రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులే చూసేవారు. కొత్తగా వ్యవసాయ శాఖను భాగస్వామ్యం చేయడం చర్చనీయాంశంగా మారింది.
పరిహారం పెంచుతాం
యాచారం మండల పరిధిలోని నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను సేకరించేందుకు గత బీఆర్‌ఎస్ సర్కార్ నిర్ణయించింది. నాలుగు గ్రామాల్లో 7,640 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరించి పరిహారం అందజేసింది. ఇంకా 2,200 ఎకరాల పట్టా భూమిని రైతులు ఫార్మాసిటీకి ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆ భూమిపై అవార్డులు పాస్ చేసి పరిహారాన్ని రైతుల పేరిట అథారిటీలో జమ చేసింది. రైతుల పేరిట ఉన్న భూరికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసింది. నాలుగేళ్లుగా టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన భూరికార్డులను తమపై మార్చాలని రైతులు చెప్పులరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పోతోంది. రైతులు హైకోర్టును ఆశ్రయించడం.. న్యాయ స్థానాలు వారికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినా అధికారులు మాత్రం మొండి వైఖరిగానే వ్యవహరిస్తున్నారు. రికార్డులు మార్చేది లేదు.. అవసరమైతే పరిహారం పెంచుతాం.. భూములు ఇవ్వమంటున్నారు. ఈ 2,200 ఎకరాలు సైతం ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో వ్యవసాయ అధికారుల ప్రచారం
వానాకాలంలో సాగు చేపట్టొద్దని వాట్సాప్‌లో మెసేజ్‌లు
నిబంధనలు ఉల్లంఘించొద్దు
నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులు వానాకాలం పంటలు సాగు చేయొద్దని ప్రచారం చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు గ్రామాల్లో విస్తరణ అధికారుల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం అవుతుంది.
– రవినాథ్, మండల వ్యవసాయాధికారి, యాచారం

ఫార్మా భూముల్లో పంటలొద్దు

ఫార్మా భూముల్లో పంటలొద్దు