
గిరిజన, చెంచులకు కొత్త పథకం
ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన, చెంచుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని.. ఇందులో భాగంగా ఇందిర గిరి సౌర జల వికాసం పథకం ప్రారంభించాలని నిర్ణయించిందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందించేందుకు నిరంతరం శ్రమిస్తుంందన్నారు. గత ప్రభుత్వం గిరిజన, చెంచుల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. చెంచులు సాగు చేసుకునే పోడు భూములకు పట్టాలిచ్చినా సాగునీటి వసతి లేక ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ భూములను వినియోగంలోకి తెచ్చేందుకు రూ.12,600 కోట్లతో ఇందిర గిరి సౌర జల వికాసం పథకాన్ని పరిచయం చేస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో పోడు పట్టాలున్న రైతులకు సాగునీటి వసతి కల్పించడంతో పాటు సౌర విద్యుత్ అందిస్తుందని వివరించారు. చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ పథకాన్ని ఈ నెల 18న నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని మన్ననూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వర్గం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేశవులు, చెంచు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండ్లి రాములు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మానయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పోడు భూముల సాగుకు ‘ఇందిర గిరి సౌర జల వికాసం’
ఈ నెల 18న ప్రారంభించనున్నసీఎం రేవంత్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి