
జాతరకు వెళ్లొస్తూ.. అనంత లోకాలకు
కందుకూరు: పక్కన ఊరిలో జరుగుతున్న జాతరకు వెళ్లొస్తూ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కందుకూరు సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గూడూరుకు చెందిన పోలదాస్ రాజు(40) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సోమవారం సాయంత్రం ఊట్లపల్లిలో జరుగుతున్న జాతరకు బైక్‌పై వెళ్లి తిరిగి రాత్రి వేళలో స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో కందుకూరు సమీపంలో ఏఎస్ దాబా ఎదుట శ్రీశైలం హైవేపై వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతని బైక్‌తో పాటు ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఫౌల్ట్రీఫారమ్‌లో పని చేసే ఒడిశాకు చెందిన మను, జగన్‌లను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో బైక్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మనుకు గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమారై ఉన్నారు. ఈ మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని వాహనంఢీకొని వ్యక్తి దుర్మరణం