
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
● త్వరలో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయం ● వచ్చే విద్యాసంవత్సరంలో వైద్య విద్యార్థులకు హాస్టల్స్ నిర్మాణం ● రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ● వికారాబాద్‌లో 300 పడకల జనరల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం
అనంతగిరి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ పట్టణంలో రూ.30 కోట్లతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణ, అన్ని విభాగాలను, తరగతిగదులను పరిశీలించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి సీనియర్ నర్సులు శంకరమ్మ, శాంతమ్మలను సత్కరించారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగిలో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, వికారాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించుకున్నామన్నారు. వికారాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన 300 పడకలు ప్రారంభించుకున్నామని, 50 పడకల క్రిటికల్ కేర్, పాత ఆస్పత్రిలో 70 పడకలు మొత్తం 420 పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాల విద్యార్థులకు బాలుర, బాలికలకు వేర్వేరుగా పక్కా వసతి గృహ భవన నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, డీఎంహెచ్‌ఓ వెంకటరవణ, డీసీసీబీ మెంబర్ కిషన్‌నాయక్, ఆర్‌టీఏ సభ్యుడు జాఫర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, మాజీ లైబ్రరీ చైర్మన్ ఎండీ హఫీజ్, ఏయంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, జిల్లా అధికారులు, వైద్యులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.