
పరిగిలో రెండేళ్లలో వంద పడకల ఆస్పత్రి
పరిగి: పేదలకు ఆత్మస్థైర్యం నింపేలా ప్రభుత్వ వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన పరిగి పట్టణ కేంద్రంలో రూ.27 కోట్లతో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో పరిగిలో వంద పడకల ఆస్పత్రి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను విస్తరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఎప్పుడు కలిసిన నియోజకవర్గ అభివృద్దిపైనే మాట్లాడుతారన్నారు. డయాలసిస్ సెంటర్‌లో బెడ్లు, మిషన్ల సంఖ్యను పెంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకుంటామని హమీ ఇచ్చారు. జాతీయ ప్రధాన రహాదారులపై ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 213 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో 400 మంది విద్యార్థులకు అదనంగా సీట్లు వస్తున్నాయన్నారు. పరిగిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరారని పరిశీలించి ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. బీపీ, షుగర్, క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని వీరికి వైద్యం అందించేందుకు అన్ని జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో నాలుగు దిక్కుల నాలుగు రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఫెడరేషన్ చైర్మన్ కల్వ సుజాత, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు పరశురాంరెడ్డి, ఆంజనేయులుముదిరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.