
ఫార్మా ఠాణా తరలింపు..
ఫార్మాసిటీ భద్రత కోసం నక్కర్తమేడిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కుర్మిద్దకు తరలించనున్నారు. అందరికీ అనుకూలంగా గ్రామాలకు మధ్య ఠాణా ఉండే విధంగా అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలోతాత్కాలిక భవనంలోకి మార్చనున్నారు.
యాచారం: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ.. రైతులు ఆందోళనలు చేశారు. నిరసన కార్యక్రమాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా భద్రతకు స్థానికంగా పోలిస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా.. ఫార్మా భూములు సేకరించిన యాచారం, కందుకూరు మండలాల పరిధి 20 గ్రామాలు, వాటి అనుబంధ గ్రామాలను కలుపుతూ రాచకొండ కమిషనరేట్ పరిధి నక్కర్తమేడిపల్లిలో అద్దె భవనంలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణా’ను ఏర్పాటు చేసింది. ఒక సీఐ, ఎస్‌ఐలు, 30 మంది పోలీస్ సిబ్బందిని నియమించింది. ప్రస్తుతం పోలీసు పహారాలో నెల రోజులుగా ఫార్మా భూముల సర్వే, ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి.
పదిరోజుల్లో..
ఫార్మాసిటీ పీఎస్‌ను యాచారం మండలం కుర్మిద్దకు తరలించనున్నారు. గతంలో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేసిన భవనంలోకి మార్చనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతుండగా.. సీఐ లిక్కి కృష్ణంరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజులు ఈ భవనాన్ని పరిశీలించారు. మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి కానుండగా.. పది రోజుల వ్యవధిలో పీఎస్‌ను మార్చేందుకు పోలీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
‘నెట్ జీరో సిటీ’గా..
గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్.. అవే భూముల్లో ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. అయితే ఫార్మాను రద్దు చేసి, ఠాణా పేరు అదే ఉంటే ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని భావించిన పోలీసు యంత్రాంగం.. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌ను పేరును ‘నెట్ జీరో సిటీ పీఎస్’గా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. దీంతో కుర్మిద్దలోనూ పూర్వ పేరుతో ప్రజలకు సేవలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నక్కర్తమేడిపల్లి నుంచి పోలీస్ స్టేషన్ తరలించవద్దని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కుర్మిద్ద తాత్కాలిక భవనంలోకి మార్పు
ప్రస్తుతం నక్కర్తమేడిపల్లిలోకొనసాగుతున్న పీఎస్
మార్చొద్దని గ్రామస్తుల ఆందోళన
అందరికీ అందుబాటులో..
ఫార్మాసిటీ పీఎస్‌ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా యాచారం మండలం మధ్యలో ఉన్నకుర్మిద్ద గ్రామానికి మార్చబోతున్నాం. అక్కడి తాత్కాలిక భవనంలో పీఎస్‌కు తగిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. పది రోజుల్లో ఠాణాను తరలిస్తాం. ఫార్మా పీఎస్‌ను నెట్ జీరో సిటీగా పేరు మార్చేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించాం.
– లిక్కి కృష్ణంరాజు, సీఐ, ఫార్మాసిటీ పీఎస్

ఫార్మా ఠాణా తరలింపు..

ఫార్మా ఠాణా తరలింపు..