
పాత కరెన్సీ మార్పిడీకి యత్నం
● రూ.99 లక్షల నగదు స్వాధీనం
● నలుగురి అరెస్టు..మరో నలుగురి పరారీ
సనత్‌నగర్: రద్దయిన కరెన్సీ నోట్లను మార్చేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యక్తులను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.99 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఎస్‌ఐ జయచందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.టీవోలీ ఎక్స్‌ట్రీమ్ థియేటర్ వద్ద రద్దయిన పాత నోట్ల మార్పిడీకి యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం మధ్యాహ్నం ఎస్‌ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా వేపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్వర్, బుర్రా శివకుమార్, పుట్టపల్లి రవీందర్‌రెడ్డి, గొల్లమందల రవిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన రద్దయిన రూ.1000, రూ.500ల కరెన్సీ నోట్లతో పాటు కారు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 20 శాతం కమీషన్ ప్రాతిపదికన వీరు మరికొందరితో కలిసి పాత నోట్లమార్పిడికి యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేయ గా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గా లిస్తున్నారు. ఈ మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారి బలవన్మరణం
సికింద్రాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ అల్వాల్ మంగాపురం కాలనీకి చెందిన పీచర ప్రశాంత్‌కుమార్(48) వృత్తి రీత్యా వ్యాపారి. కొంత కాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికి తోడు అతడి తల్లి కేన్సర్‌తో ఇబ్బంది పడుతోంది. దీంతో మనస్తాపానికి లోనైన అతను ఈ నెల 8న గుండ్ల పోచంపల్లి, బొల్లారం రైల్వేస్టేషన్ల మధ్య సిద్ధిపేట, మల్కాజిగిరి ప్యాసింజర్ రైలుకు ఎదురుగా వెళ్లి అత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య వాసంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారులో మంటలు
కాలిపోయిన కారు: తప్పించుకున్న డ్రైవర్
శంషాబాద్ రూరల్: రహదారిపై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని కారు దగ్ధమైంది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... నగరం నుంచి టాటా జెస్ట్ కారు ఆదివారం మధ్యాహ్నం షాద్‌నగర్ వైపు వెళ్తుంది. బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి శివారులో ఉన్న రైల్వే వంతెనపైకి రాగానే కారులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ హుస్సేన్ వెంటనే కారును నిలిపివేసి కిందకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో పాటు ఫైర్ ఇంజన్‌ను రప్పించి మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలకు కారు ఆహుతైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ వివరించారు.