
రెండు కాడెద్దులు తస్కరణ
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు రెండు కాడెద్దులను ఎత్తుకెళ్లిన సంఘటన మండల పరిధిలోని సోలీపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు కావలి బుచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తన వ్యవసాయ పొలంలో శనివారం రాత్రి రోజు మాదిరిగానే పశువులకు మేత వేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆదివారం ఉదయం వెళ్లి పశువుల పాకలో చూడగా రెండు కాడెద్దులు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని వాపోయాడు.
వ్యక్తి అదృశ్యం
అబ్దుల్లాపూర్‌మెట్ : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట కు చెందిన ఎండీ నజీర్ (65) సునీల్ అనే వ్య క్తి దగ్గర పెయింటింగ్ పని చేయడానికి వస్తుంటాడు. ఈక్రమంలో శనివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్‌లో నిర్వహిస్తున్న పెయింటింగ్ పనికి కూలీగా వచ్చాడు. మధ్యాహ్నం 2గంటల సమయంలో దుకాణానికి వెళ్తున్నా అని చెప్పి పని దగ్గర నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకూ తిరిగి రాలేదు. సునీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
తప్పిన పెను ప్రమాదం
దుద్యాల్: అదుపుతప్పిన కారు విద్యుత్ సం్తభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని ఈర్లపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. బొంరాస్‌పేట్ మండలం చౌదర్‌పల్లికి చెందిన కావలి రాజు, సిద్ధు పని నిమిత్తం నారాయణపేట్ జిల్లా కోస్గి పట్టణానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈర్లపల్లి సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం మూడు ముక్కలయింది. కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.