
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని...
దుండిగల్: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్‌పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచ్చిన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.