
స్వప్రయోజనాల కోసమే కులమతాలు
బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య
చేవెళ్ల: రాజకీయ ప్రయోజనాలకోసమే కులమతాలను పెంచి పోషిస్తున్నారని బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య ఆరోపించారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లాస్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. పార్టీ జిల్లా కార్యదర్శి జంగయ్య మాట్లాడారు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మూడు వేల కులాలు, 25వేల ఉపకులాలు, 8 మతాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో నూటికి ఎనభైశాతం మంది హిందూ మతాన్ని విశ్వసిస్తున్నారని చెప్పారు. కులమతాలు రాజకీయ ప్రయోజనాలకోసమే పుట్టాయని, కులమతాలను రెచ్చగొట్టి సంబురాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వృత్తుల ఆధారంగా కులాలను అంటగట్టారని, ఇప్పుడు ఆ వృత్తులన్ని పోయి, అన్యవృత్తులు చేస్తున్నా.. కులాలు మాత్రం పోలేదని వివరించారు. మత విద్వేశాలను రెచ్చగొట్టే రాజకీయ నాయకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాంతయ్య డిమాండ్ చేశారు. ఏఐటీయుసీ రాష్ట్ర నాకుయకుడు కె.రామస్వామి, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభులింగం, మహిళా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.
టపాసులపై నిషేధాజ్ఞలు
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలు: సీపీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రసుత్తం నెలకొన్న పరిస్థితులతో పాటు భద్రతా కారణాల నేపథ్యంలో నగర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సున్నిత సంస్థలు, మిలిటరీ సంబంధిత ప్రాంతాల్లో ఈ నిషేధం మరింత కచ్చితంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇండో–పాక్ సరిహద్దులతో పాటు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో టపాసులు కాల్చినా అది తీవ్ర భయాందోళనలకు ఆస్కారం ఇవ్వవచ్చని ఆనంద్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ దాడి చేసిందనో, బాంబు దాడులు జరిగాయనో, ఉగ్రవాదుల దుశ్చర్య గానో భావించి ప్రజలు గందరగోళానికి, ఆందోళనకు గురవుతారని ఆయన పేర్కొన్నారు.