
అమ్మ కష్టం వృథా కాలే..
పరిగి: భర్త మృతితో కుంగిపోకుండా పిల్లల ఎదుగుదలే ధ్యేయంగా కష్టపడింది. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివించింది. అమ్మ కష్టాన్ని గుర్తించిన ఆ బిడ్డలు బుద్ధిగా చదువుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊటుపల్లి గ్రామానికి చెందిన కావలి పోచమ్మ, అనంతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే అనారోగ్యం బారిన పడి అనంతయ్య మృతిచెందాడు. సెంటు భూమి కూడా లేని నిరుపేద కుటుంబం వీరిది. ఇంటి పెద్ద దిక్కు కూలిపోవడంతో ఆతల్లి రెక్కలు విరిగినట్లయింది. తిండికి కూడా లేని పరిస్థితిలో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వీటన్నింటినీ ఎదుర్కొని, పిల్లల కోసమే పరితపించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారి చదువును ముందుకు నడిపింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, చిన్న కొడుకు రాఘవేందర్ కానిస్టేబుల్‌గా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా పోచమ్మను పలకరించగా.. నేను పడ్డ కష్టానికి తగ్గట్లుగా పిల్లలు వృద్ధిలోకి రావడం సంతోషాన్నిస్తోందని భావోద్వేగం వ్యక్తంచేసింది.