
ఎడిటర్ ఇంట్లో సోదాలు అమానుషం
టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు చేయడాన్ని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీయూడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.సత్యనారాయణ, ఎం.సైదులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ బాధ్యత గల పత్రికా ఎడిటర్ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడం సరికాదన్నారు. నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులకు తిలోదకాలిస్తూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు వ్యవహరించడం అమానుషమన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా జర్నలిస్టులను భయపెట్టాలనే ఉద్దేశంతో ఏపీ పోలీసులు చట్టానికి విరుద్ధంగా వ్యవహారించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేస్తే నిబంధనల ప్రకారం నడుచుకోవాలే కానీ ఏకపక్షంగా ఇళ్లలోకి చొరబడటం ఏమిటని ప్రశ్నించారు. ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
పూడికతీత పనులు చేపట్టాలి
గోల్కొండ: కార్వాన్ నియోజకవర్గంలో వర్షపునీటి పైప్‌లైన్‌లకు పూడికతీత పనులు చేపట్టాలని నియోజకవర్గం గుడ్ గవర్నెన్స్ కమిటీ వారు బల్దియా జోనల్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు గురువారం జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి, బీజేపీ నాయకుడు జొన్నకుంటి మధుసూదన్ మాట్లాడుతూ..వరద నీటి పైప్‌లైన్‌లు పూడికలతో నిండిపోయాయన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపై సైతం డ్రైనేజీ నీరు ప్రవహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మనీష్, గోదా లక్ష్మీకాంత్‌యాదవ్ తదితరులున్నారు.