
గొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..
● మహిళ దారుణ హత్య
● చాంద్రాయణగుట్టలో ఘాతుకం
చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.