
ఇసుక బేజార్!
ఇసుక బజార్‌కుఆదరణ కరువు
● ఆదిబట్లలో గత నెల 16న ప్రారంభం ● ప్రచార లోపంతో నామమాత్రంగా కొనుగోళ్లు ● నిల్వ ఉన్నది 89,000 మెట్రిక్ టన్నులు ● ఇప్పటికి అమ్మింది 154 టన్నులే ..
ఇబ్రహీంపట్నం రూరల్: ఇసుక అక్రమ రవాణకు కళ్లెం వేయడంతోపాటు నాణ్యమైన ఇసుకను అందుబాటులోకి తీచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇసుక బజార్‌లకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని ప్రారంభించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్‌మెట్, ఆదిబట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో గతనెల 16న స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈ ఇసుక బజార్‌కు ఆదరణ కరువైంది.
ఆన్‌లైన్ విధానంలో విక్రయాలు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక బజార్‌ల్లో సన్న ఇసుక టన్నుకు రూ.1,800, దొడ్డు ఇసుక రూ.1, 600 చొప్పున ధర నిర్ణయించారు. ప్రతి కొనుగోలు ఆన్‌లైన్ విధానంలో కొనసాగించాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుక అమ్మకాలు చేపట్టాలని విజిలెన్స్ కమిటీలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డంపులు లేకుండా అరికట్టారు. కేసులు నమోదు చేసి అక్రమ డంపులను కట్టడి చేశారు. అనంతరం ఇసుక బజార్‌లను తెరిచారు. ప్రస్తుతం ఆదిబట్లలోని ఇసుక బజార్‌లో రెండు వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసి, కాంట్రక్టర్ల ద్వారా రవా ణా, ఇసుక నింపే యంత్రాలను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు 89,000 మె ట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచారు. వంగమర్తి, వీరాపురం, విజయనగరం, అనంతారం నుంచి రీచ్‌ల ద్వారా ఇసుక తీసుకొచ్చి డంప్ చేశారు.
ఎక్కడి నిల్వలు అక్కడే..
ఇసుక బజార్‌ను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు (22 రోజులు) అమ్మింది 154 టన్నులు మాత్రమే. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఇసుకబజార్‌ను ప్రారంభించిన అధికారులు ఆ మేరకు ప్రచారం చేయకపోవడంతో చాలామందికి ఇక్కడ ఇసుక నిల్వలు ఉన్నాయనే విషయమే తెలియకుండా పోయింది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పటికీ సరైన ప్రచారం లేకపోవడంతో ఎక్కడి నిల్వలు అక్కడే నిలిచిపోయాయి. రోజుకు కనీసం ఒక్క లారీ కూడా అమ్ముడు పోవడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రచారం లేకపోవడంతో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
ఇసుక కోనుగోళ్ల కోసం ఆన్‌లైన్‌లో ముందుగా కస్టమర్ ఐడీని రూపొందించుకోవాలి. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలా పోర్టల్ రూపొందించింది. అవసరమైతే మీ సేవ కేంద్రాలకు వెళ్తే దరఖాస్తు చేస్తారు. లేదంటే టీజీఎండీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఇసుక బజార్ ద్వారా నాణ్యమైన ఇసుక అందిస్తున్నాం.
– నవీన్, ఇసుకబజార్ అధికారి
సరైన ప్రచారమే లేదు
ఆదిబట్లలో ఇసుక బజార్ ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. అధికారులు వచ్చి ప్రారంభించి వెళ్లిపోయారు. స్థానికంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నా ఇసుక బజార్‌లో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఇదే ధరకు బయట దొరకడంతోపాటు సరైన ప్రచారం లేదు. ప్రభుత్వం ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లో విక్రయాలు జరిపితే బాగుంటుంది.
– బండ రాజు, ఆదిబట్ల

ఇసుక బేజార్!

ఇసుక బేజార్!