
సమస్యలను వదిలేసి.. అందాల పోటీలా?
హయత్‌నగర్: పేదల సమస్యలను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల నిర్వహణలో నిమగ్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలోని కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలో గత నెల 26న జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసెలు కాలిపోయిన బాధితులను గురువారం పరామర్శించారు. వారికి దుప్పట్లు, టవల్స్, ప్లాస్టిక్ బకెట్లు తదితర సామగ్రి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కోటీశ్వరులైన అందగత్తెలు సగం దుస్తులు ధరిస్తే.. గతి లేని పేదలు నిండుగా దుస్తులు ధరిస్తారని తెలిపారు. ఓటు వేసి గెలిపించే ప్రజలను పట్టించుకోకుండా, అందాలు ఆరబోసి వెళ్లిపోయే వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. పేదల భూములను కన్నేసి వారిని ఇక్కడి నుంచి తరిమేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే అభాగ్యుల గూళ్ల ను నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. బాధితులకు కేవలం రూ.6 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు సామగ్రి అందించేందుకు ముందుకు వచ్చిన విజయవాడ పాపులర్ షూమార్ట్‌ను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి, నాయకులు తాలు, పల్లె నర్సింహ, పబ్బతి లక్ష్మణ్, హరిసింగ్‌నాయక్, నర్సింహ, వట్టి వనిత, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపాటు
గుడిసెలు కాలిపోయిన బాధితులకు సామగ్రి అందజేత