
ఆర్టీసీ బస్సుకు తప్పిన ముప్పు
చేవెళ్ల: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కమాన్ పట్టీలు విరిగిపోవడంతో అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేసి, నియంత్రించడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి కొండగల్, కోస్గి వెళ్తున్న కోస్గి ఆర్టీసీ బస్సు మీర్జాగూడ బస్ స్టేజీకి సమీపంలోకి రాగానే రోడ్డు ములుపు వద్ద కమాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో బస్సు రోడ్డు కిందికి దూసుకెళ్లి, ఆగిపోయింది. ఈ సంఘటనతో అందులో ఉన్న సుమారు 60మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు మరికొంత దూరం వెళ్లి ఉంటే బోల్తా పడి ఉండేదని చెప్పారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కమాన్‌పట్టీలు విరగడంతో ప్రమాదం
రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు
60 మంది ప్రయాణికులు సురక్షితం