కాసుల కక్కుర్తి! | - | Sakshi
Sakshi News home page

కాసుల కక్కుర్తి!

May 7 2025 7:33 AM | Updated on May 7 2025 7:33 AM

కాసుల కక్కుర్తి!

కాసుల కక్కుర్తి!

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు

ఇబ్రహీంపట్నం: జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ వైద్యుల పేరిట ఆస్పత్రులకు అనుమతులు తీసుకుని స్టాఫ్‌ నర్స్‌లు, ఆర్‌ఎంపీలతో వైద్యశాలలు నెట్టుకొస్తున్నారు. అనుభవం, అర్హత ఉన్న డాక్టర్ల పేరుతో ఆస్పత్రులను నెలకొల్పి.. నర్సులు, సిబ్బంది చేత వైద్యం చేయిస్తున్నారు. డబ్బు సంపాదనే పరమావధిగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్యం చేస్తున్న వారి భరతం పట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది.

అక్రమార్జనే లక్ష్యంగా..

కోవిడ్‌ సమయంలో పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూ లు చేసి దోపిడీకి పాల్పడిన విషయం విదితమే. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుల మేరకు జిల్లా వైద్యాధికారులు దాడులు చేసి స్కానింగ్‌ సెంటర్లు సీజ్‌ చేసినా అవి కొంత కాలానికే మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇటీవల ఓ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబం విలవిలలాడింది.

వివాదాలకు కేరాఫ్‌ ‘విజయలక్ష్మి’

ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రి వివాదాలకు నిలయంగా మారింది. ఏడాదిన్నర క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళ గర్భందాల్చడంతో మళ్లీ ఆపరేషన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. వారి బంధువులు ఆందోళనకు దిగడంతో అప్పట్లో డీఎంహెచ్‌ఓ ఆస్పత్రిని తనిఖీ చేసి చేతులు దులుపుకొన్నారే తప్ప చర్యలు తీసుకోలేదు. ఇదే ఆస్పత్రిలో సోమవారం డాక్టర్‌ అనూషరెడ్డి వాట్సాప్‌లో స్టాఫ్‌ నర్స్‌కు సూచనలిస్తూ ఎలిమినేడుకు చెందిన గర్భిణి కీర్తికి వైద్య చికిత్స చేసి గర్భస్థ పిండాల(మగ కవలలు) మృతికి కారణమైంది. వివాహమైన ఏడేళ్లకు పిల్లలు పుడుతున్నారనే సంతోషం ఆ కుటుంబానికి దూరం చేసింది. కీర్తి బంధువులు ఆందోళన చేపట్టడంతో డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు విజయలక్ష్మి ఆస్పత్రిని తనిఖీ చేసి సీజ్‌ చేశారు.

అందుబాటులో ఉండని వైద్యులు

ప్రైవేట్‌ ఆస్పత్రులను స్థాపించిన వైద్యులు స్థానికంగా ఉండడంలేదు. వేరే ఆస్పత్రుల్లో పనిచేస్తూ రోజుకు ఓ రెండు గంటలపాటు వచ్చి వెళ్తున్నారు. పేషెంట్స్‌కు కండిషన్‌ సీరియస్‌ అయినప్పుడు వైద్యులు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రులు ఎవరి పేరిట ఏర్పాటు చేస్తున్నారో ఆ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

అర్హత లేని వారితో రోగులకు చికిత్సలు

నిర్లక్ష్యంతో నిండుప్రాణాలు బలి

ప్రాణాలను కాపాడేది వైద్యం. అందుకే వైద్యులను సాక్షాత్తు నారాయణుడిగా కీర్తిస్తారు. ప్రాణదాతగా గౌరవిస్తారు. కొంత మంది వైద్యులు వృత్తి ధర్మం మరిచి కాసులకు కక్కుర్తి పడడంతో కనిపించే ఆ దైవమే వారి పాలిట శాపంగా మారుతోంది. ఇబ్రహీంపట్నంలోని వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ ఇల్లాలి మాతృత్వపు కలను చిదిమేసిన ఘటనే ఇందుకు నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement