
ఇక భూ సమస్యలు ఉండొద్దు
● ప్రతీ సర్వేనంబర్ పరిశీలించి సరిచేయండి ● రెవెన్యూ సదస్సులో కలెక్టర్ నారాయణరెడ్డి
కొందుర్గు: భవిష్యత్‌లో భూ సమస్యలు ఉండకుండా అన్నీ సరిచేసుకోవాలని.. కొందర్గు మండలాన్ని ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని శ్రీరంగాపూర్, ఉత్తరాసిపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతీ సర్వే నంబర్ పరిశీలించి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉంటే సరిచేయాలని సూచించారు. పట్టాదారు పాస్తుపుస్తకాల్లో తప్పులున్నా, భూములు సరిగ్గా రికార్డుల్లో లేకున్నా వినతిపత్రాలు ఇచ్చి సరిచేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ సరిత, తహసీల్దార్లు రమేశ్ కుమార్, జగదీశ్వర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు బాబర్‌ఖాన్, పురుషోత్తం రెడ్డి, రోహిత్ రెడ్డి, అంజిరెడ్డి, సయ్యద్ సాధిక్, మల్లేశ్ గౌడ్, జహంగీర్, వాజీద్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యం
గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే తమ లక్ష్యమని షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ సయ్యద్ సాధిక్ అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సయ్యద్ సాధిక్, అశోక్ రెడ్డి సహకారంతో రూ.6.30 లక్షల ఖర్చుతో గ్రామంలో వాటర్‌ప్లాంట్ ఏర్పాటుచేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డి వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించి దాతలను అభినందించారు.